📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

శబరిమల దివ్యక్షేత్రం – స్వామియే శరణం అయ్యప్పా….

అయ్యప్ప మాలధారణ ఓ అద్భుతమైన దీక్ష…..కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠిన నియమాలతో, నిష్ఠలతో 41 రోజుల పాటు మండలదీక్ష చేయడంతో మాలధారులు పునీతులవుతారు. ఆధ్యాత్మిక జీవనశైలి అలవడుతుంది. తెల్లవారుఝామున లేచి బ్రహ్మముహూర్తంలో చన్నీటి స్నానం చేయడం.. కటిక నేలపై నిద్రపోవడం..నల్లని బట్టలు ధరించి చందన ధారణతో ప్రతి ఒక్కరిని స్వామీ అని పిలవడం…
ప్రతి ఒక్క మాలధారుడి జీవనశైలిని మార్చివేస్తుంది. మాలధారులకు అంతకుముందు ఎన్ని దురలవాట్లు ఉన్నా మాలధారణతో దురలవాట్లకు దూరంగా ఉంటారు. వీరి జీవనశైలి మారిపోతుంది శబరిమల ….. నియమాల తోరణం..
కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో శబరిమల క్షేత్రం నెలకొనివుంది. ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే ఆలయం తెరచి ఉంటుంది. ముఖ్యంగా మలయాళ వృశ్చికమాసం (నవంబరు-డిసెంబరు)లో మండల చిరప్పు ప్రారంభమవుతుంది. ఇందు కోసం కార్తికం ముందునుంచి దీక్ష తీసుకుంటారు. ఆ రోజు నుంచి భక్తుల జీవనశైలి మారిపోతుంది.

నల్లని బట్టలు ధరించి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ వారు సాగించే దీక్షలోని నియమాలు సామాన్యులకు కఠినమే. అలాగే దీక్షా సమయంలో అందరూ ‘స్వామి’గా భావించి వ్యవహరించడం అపురూప అనుభూతిని ఇస్తుంది. మండలకాలం అంటే 41 రోజుల పాటు స్వామిదీక్షను పూర్తిచేసుకొని ఇరుముడిని కట్టుకొని శబరిమలకు వెళ్లాలి. నేతితో నిండిన కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు, బియ్యం, వస్త్రాలు… తదితరాలతో నిండిన ఈ మూటను గురుస్వామి భక్తుల శిరసున ఉంచుతారు.
చుట్టూ దట్టమైన అడవులతో ఉన్న ప్రఖ్యాతి గడించిన పుణ్యక్షేత్రం శబరిమల. సహజసిద్దమైన ప్రకృతి ఒడిలో ,పంబా నది ఒడ్డున , పశ్చిమ కనుమల పర్వత శ్రేణులలో ఉన్నది ఈ పుణ్యక్షేత్రం.లక్షలాది భక్త జనం మలయాళ క్యాలెండర్ ప్రకారం మండలకల కాలం అయిన నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ క్షేత్రానికి తరలి రావటం జరుగుతుంది. భారతదేశ నలుమూలల నుండి భక్తులు తమ తమ మతాలకు అతీతంగా, మరియు ఆర్ధిక స్తితిగతులకు అతీతంగా ఈ క్షేత్రానికి ప్రతిసంవత్సరం వస్తారు.

సబరిమల్ అంటే శబరి( రామాయణ గాథ లోని ఓక పుణ్య పాత్ర ) యొక్క పర్వత శ్రేణి అని అర్ధం.కేరళ లోని మానవీయ పెరియర్ టైగర్ హిల్ రిజర్వు లో ఉన్నటువంటి , పట్టనంతిట్ట జిల్లా కి తూర్పు ప్రాంతాన ఉన్నదీ గొప్ప క్షేత్రం.ఈ దేవాలయం లో కొలువున్న దేవుడు అయ్యప్ప లేదా స్వామీ అయ్యప్ప. ఈ స్వామి దర్శనం కోసం ఇక్కడకి రావాలనుకొనే భక్తులు తప్పనిసరిగా 41 రోజులు శాఖాహారులై లౌకిక సుఖాలకు దూరం గా ఉండాలి.

ఇక్కడి దేవాలయానికి ఉండే పచ్చని చెట్లు,ప్రవాహాలు మరియు పచ్చిక బయళ్ళ లో నుండి ఉండే కాలిబాట లో ప్రయాణం ప్రతిఒక్కరికి భగవత్ ప్రేరేపిత అనుభవం గా ప్రతి ఒక్కరు తమ జీవిత కాలం లో చవి చూడ వలసిన ఒక అద్భుతం.

కాలినడకన దేవాలయం చేరే భక్తులు ఈ పొడవైన, కఠినమైన మార్గం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఉండే చెట్ల నీడలో విశ్రమించి సేదతీరి ప్రయాణం కొనసాగించవచ్చు. ప్రపంచం లోనే అతి గొప్ప పుణ్యక్షేత్రం గా పేరు గడించిన ఈ శబరిమల కు ప్రతి సంవత్సరం సుమారు 45-50 మిలియన్ ల భక్తులు విచ్చేస్తారు.18 కొండల మధ్య ఉన్న ఈ అయ్యప్ప స్వామి కోవెల చూడటానికి ఏంతో కన్నుల పండుగగా ఉంటుంది.ఈ దేవాలయం పర్వత శ్రేణుల మధ్య, దట్టమైన అడవుల మధ్య శిఖరం పైన సముద్ర మట్టానికి 1535 అడుగుల ఎత్తున ఉన్నది.


భయంకరమైన రాక్షసి మహిషి ని అంతమొందించి అయ్యప్పస్వామి ఇక్కడ తపస్సు చేసారని పురాణాలు చెపుతాయి. శబరిమల దేవాలయం చాలామంది భక్తులకు సమానతకు ,సమైక్యతకు,మంచికి చిహ్నం గా గోచరిస్తుంది. ఇది భక్త జనానికి మరొకసారి మంచి ఎప్పుడు చెడుని జయిస్తుంది అని , ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుంది అనే సత్యాన్ని గుర్తుచేస్తుంది.మతాతీతంగా, కులాతీతంగా, వర్ణాతీతం గా భక్తులకు అందుబాటు లో ఉన్న అతి కొద్ది దేవాలయాలలో శబరిమల పుణ్య క్షేత్రం ఒకటి.మహావిష్ణువు యొక్క ఒకానొక అవతారమైన పరశురామ మహర్షి తన గొడ్డలిని పారవేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని శబరిమల లో ప్రతిష్టించారని చెప్పబడుతుంది. ఈ శబరిమల ప్రభుత్వ ఆధ్వర్యం లోని ద త్రావెంకరే దేవస్వోం బోర్డు (TDB) యొక్క నిర్వహణ లో ఉన్నది.

పుణ్యక్షేత్రంశబరిమల దీక్షా కాలం నవంబర్ మధ్యలో ప్రారంభమై జనవరి నాలుగవ వారంలో ముగుస్తుంది. జనావాసాలు లేకపోయినా శబరిమల పట్టణ సముదాయం నిరంతరం యాత్రికులు, దుకాణాలు మరియు హోటల్స్ తో ఎప్పుడూ రద్దీ గా నే ఉంటుంది. శబరిమల లో ప్రధానంగా జరుపుకునే పండుగలు మండల పూజ మరియు మకరవిలక్కు. వవారు స్వామి అనబడే ముస్లిం పకిరుకి ఇక్కడ మందిరం ఉంది. అందువల్ల, ఈ ప్రాంతం మతాలకు అతీతంగా ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తుంది.

శ్రీ అయ్యప్ప దేవాలయం




స్వామి అయ్యప్పని ఆరాధించే ప్రసిద్ద పుణ్యక్షేత్రం శబరిమల లో ఉన్న అయ్యప్ప గుడి. ప్రతి సంవత్సరం, స్వామి వారి ఆశీస్సులు పొందడానికి భక్త జన సమూహం ఇక్కడికి తరలి వస్తారు. ఈ ప్రాంతంలో భక్తులు ఆధ్యాత్మికానందం, సంతృప్తి, శ్రేయస్సువంటివి ప్రసాదించమని కోరుకుంటారు. ఇక్కడ నవంబర్ నెలలో ప్రారంభమయ్యే యాత్రా కాలం జనవరి చివరి వరకూ కొనసాగుతుంది.

ఎరుమేలితో ఆరంభం..
ఇరుముడి తలదాల్చిన భక్తబృందం ఎరుమేలి నుంచి అసలు యాత్రను ప్రారంభిస్తుంది. ఈ దీక్షకు మతంతో సంబంధం లేదన్న వాస్తవాన్నీ, అసలైన లౌకిక భావన భారతీయుల సొంతమనీ వెల్లడి చేసే వేదిక ఎరుమేలే! హైందవ ధర్మానుసారం దీక్షచేసిన భక్తులు తొలుత ఇక్కడి వావర్ మసీదును దర్శించుకొని అక్కడి ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
ఈ సందర్భంలోనే రంగులు జల్లుకొని వాద్యబృందాలు తోడు రాగా ‘పేటతుల్లాల్’ను నిర్వహిస్తారు. పిదప ఎరుమేలిలోని ధర్మశాస్తకు పూజలు చేస్తారు. ఇక్కడి నుంచి శబరిగిరికి చేరే పెద్దపాదం, చిన్నపాదం అనే మార్గాలు ఉన్నాయి. చిన్నపాదం అంటే ఎరుమేలి నుంచి పంపాతీరం వరకూ వాహనాల్లో ప్రయాణించి అక్కడ స్నానం చేసి నీలిమలను అధిరోహిస్తారు.
ఇక పెద్దపాదం అంటే ఎరుమేలి నుంచే నడుస్తూ దాదాపు 80 కిలోమీటర్లు నడిచి కొండకు చేరడం! ఈ వనయాత్ర చేసే భక్తులు మొదట ‘పెరుర్తోడు’కు వెళ్లి స్నానాదికాలు ముగించి అక్కడి దేవుణ్ని పూజిస్తారు. తరవాత కాలైకట్టి అనే ప్రాంతానికి వెళ్తారు. పిదప అళుదా నదీ తీరానికి వెళ్లి పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ నదీ ప్రవాహానికి కారణమైన గాథను గురుస్వాములు తప్పనిసరిగా చెబుతారు. అయ్యప్ప చంపిన మహిషి కార్చిన కన్నీరే నదిగా మారిందని అంటారు.
ఇక్కడ చిన్నరాయిని తీసుకొని అళుదామేడు దాటి ఇంజిపరైకోటై చేరుకొంటారు. కళిడం కుండ్రు అనే ప్రదేశంలో ఈ రాయిని వేస్తారు. కరిమల యాత్రకు శ్రీకారం చుడుతారు. పెరియనపట్టం, చెరియనపట్టం మీదుగా పంపకు (దీనినే పంబ అని వ్యవహరిస్తారు) చేరతారు.. ఈ వనయాత్రలోనే కొందరు భక్తులు శక్తిపూజ చేసి అన్నదానం చేస్తుంటారు.

                                
అయ్యప్పస్వామిని ….కనులార దర్శించేవేళ..
పంపానదిలో స్నానం చేసి అక్కడి గణపతికి ఇరుముడిని చూపిస్తారు. తరవాత దాదాపు అయిదు కిలోమీటర్ల ఎత్తున్న నీలిమలను ఎక్కాలి. అనంతరం శరంగుత్తికి వెళ్లాలి. ఈ ప్రదేశంలోనే తొలిసారి మాలను ధరించిన కన్నెస్వాములు- (మొదటిసారి అయ్యప్ప దీక్ష తీసుకున్నవారిని కన్నెస్వామి అంటారు) ఎరుమేలి నుంచి తీసుకువచ్చిన శరాలను గుచ్చాలి. తరువాత సన్నిధానంలోకి అడుగుపెడుతారు. అప్పటి వరకు కొండలు, కోనలు దాటుకొంటూ వచ్చిన భక్తులు స్వామివారి ఆలయం చూడగానే ఆధ్యాత్మిక అనుభూతికి గురవుతారు. ఇరుముడిని దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి (పద్దెనిమిది మెట్లు) మీదుగా దేవాలయాన్ని చేరేందుకు సిద్ధమవుతారు. ఆలయానికి ద్వారపాలకులైన కడుత్తస్వామి, కరుప్పస్వామిలకు టెంకాయలు కొడుతారు. ఆ మెట్లను ఎక్కి స్వామి సన్నిధికి ప్రదక్షిణ చేసి ఇరుముడిని అయ్యప్పకు చూపించి ఆలయం నుంచి కిందికి దిగడంతో యాత్రలోని ప్రధానభాగం పూర్తవుతుంది.
నేతి అభిషేకం
చిన్నపాదం, పెద్దపాదం ఏదైనా యాత్ర ఆద్యంతం స్వామి నామసర్మణతో శరణుఘోషతో సాగుతుంది. వేలాదిమంది భక్తులతో కోలాహలంగా వుండే ఈ ప్రాంతం అనునిత్యం స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే అయ్యప్పో.. లాంటి ఆధ్యాత్మిక నినాదాలతో అక్కడి కొండలు ప్రతిధ్వనిస్తాయి. మండల చిరప్పు, మకర విలక్కు సమయాల్లో ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నేతితో అభిషేకాలు జరుగుతుంటాయి. భక్తులు చేయించే ఈ అభిషేకాన్ని ఇలా విశ్లేషిస్తారు. ‘ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం ఇందులో ఇమిడివుంది. అలాగే నెయ్యిని తీసుకొచ్చిన కొబ్బరి చిప్పల్ని హోమాగ్నిలో వెయ్యాలి. భక్తుడి కర్మఫలాన్ని ఆ ప్రజ్వలనం ధ్వంసం చేస్తుంది’.
తరువాత భక్తులు మాలికాపురత్తమ్మ ఆలయాన్ని , నాగరాజ, నాగాయక్షి ఆలయాలను దర్శించుకొంటారు. మాలికాపురత్తమ్మ ఆలయంలో కొబ్బరికాయను ఆ గుడి చుట్టూ తిప్పి వదిలేస్తారు. ఇక్కడ కొబ్బరికాయను కొట్టే ఆచారం లేదు.!

ఈ సమయంలో జరిగే అయ్యప్ప స్వామి ప్రార్ధనలతో చుట్టూ ఉన్న కొండలన్నీ ప్రతిధ్వనిస్తాయి. గర్భగుడికి చేరేందుకు భక్తులు పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ప్రతి ఒక మెట్టు మనిషి లో ని ఒక లక్షణానికి ప్రతీక అని ఒక నమ్మకం. మొదటి అయిదు మెట్లు పంచేంద్రియాలని, తరువాత ఎనిమిది మెట్లు భావోద్వేగాలకి, ఆ తరువాత మూడు మెట్లు మానవ గుణాలకి, చివరి రెండు మెట్లు జ్ఞానం మరియు అజ్ఞానాలకి చిహ్నాలని నమ్మకం. మలికప్పురం దేవి కి అయ్యప్ప స్వామి గుడి కి పక్కనే ఒక గుడి అంకితమివ్వబడింది.

ఈ కొండ పైకి ఎక్కడానికి సుమారు మూడు కిలో మీటర్లు కాలి నడకన వెళ్ళాల్సి వస్తుంది. వివిధ రకాల వృక్ష మరియు జంతు జాలం, అద్భుతమైన పర్వత సౌందర్యం దారి పొడవునా కనువిందు చేస్తాయి. ప్రకృతి ని ఆరాధించేవారికి ఈ శబరిమల సందర్శనం మధురానుభూతిని కలిగిస్తుంది.

ఎరుమేలి నుంచి శబరిమల వరకూ సాగే యాత్ర మకరసంక్రాంతి రోజున తుది ఘట్టానికి చేరుతుంది. వేనవేల సంఖ్యలో భక్తులు శబరికొండ నుంచి నీలకల్ ప్రాంతం వరకు వుంటారు. తిరువాభరణాల వూరేగింపు చూసిన భక్తులు స్వామి శరణాలను వల్లిస్తారు.

మకరవిళక్కు

సంవత్సరానికి ఒక్కసారి మకర సంక్రాంతి నాడు శబరిమల లో వైభవంగా జరిపే అతి పెద్ద పండుగ ‘మకరవిళక్కు’. సుమారు అయిదు లక్షల మంది యాత్రికులు ఈ పండుగ సమయంలో శబరిమలకి తరలి వస్తారు. మకరవిలక్కు పండుగని జనవరి పద్నాలుగవ తేదిన జరుపుకుంటారు. ఈ గుడిలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహాన్ని, ఈ శుభప్రదమైన రోజున రాజరికపు రత్నాలతో అందంగా అలంకరిస్తారు.

ఎలా వెళ్లాలి ?……
– రైలులో వెళ్లే భక్తులు చెంగనూర్ లేదా కొట్టాయం రైల్వేస్టేషన్లలో దిగి కారు లేదా బస్సుల ద్వారా పంప వెళ్లవచ్చు.
-దేశంలోని అనేక ప్రాంతాలనుంచి రవాణాసౌకర్యం ఉంది.
– కొచ్చి లేదా తిరువనంతపురం విమానాశ్రయాలకు వెళ్లి. అక్కడ నుంచి వాహనాల ద్వారా పంప చేరుకోవాలి. అక్కడ నుంచి కాలినడకన ముందుకెళ్లి స్వామిని దర్శించుకోవచ్చు.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading