📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

నాగుల చవితి

nagula chaviti

మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి నాగుల చవితి కార్తీకశుద్ద చతుర్దశి నాడు దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. సంతానం లేకపోతే, పుట్టిన వారు బ్రతకక పోయినా , నాగ ప్రతిష్ట చేసి పూజించటం తెలుగునాట చాలా ప్రాంతాలలో ఆచరిస్తున్న సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుట్టిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు.

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘ వెనుబాము’ అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారంలో వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాలు నివంసించే పుట్టలో పాలు పోసి, పూజలు చేస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ‘ శ్రీమహావిష్ణువు” కు ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటంలోగల అంతరార్థమని చెప్తారు.

ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. నాగులచవితి సందర్భంగా పుట్ట వద్ద ” దీపావళి” నాడు మిగిలిన మతాబులు, కాకర పువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.

నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం
నన్నేలు నాగన్న , నాకులమునేలు
నాకన్నవారల నా ఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు
పడగ తొక్కిన పగవాడనుకోకు
నడుము తొక్కిన నావాడనుకొనుము
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము
ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము
అని పుట్టలో పాలు పోస్తూ , నూక వేసి వేడుకుంటారు .అలాగే
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి…

అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.
ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా ఉపవాసముండి మరునాడు పారాయణం చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువుల కాపరి కూడా ప్రభువు అవుతాడంటారు ! నేటి రోజులలో పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని, అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యవద్దని చెప్తున్నారు. దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు.

భారతీయ నాగరికత, సంప్రదాయాలు చాలా గొప్పవి. మానవ మనుగడకు జీవనాధరమైనది ప్రకృతి కనుక ప్రకృతి దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్లను, పుట్టలను , నదులను, పర్వతాలను – ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా భావిస్తూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే … అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి లోపల నివసిస్తూ పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతులకు పంటనష్టం కలగకుండా చేస్తాయి.. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ధ్వంసం చేయకుండా ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుకుంటూ అన్నిజంతువులను బ్రతకనిస్తే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉండదు.

నాగుల చవితి శుభాకాంక్షలు

🐍 నాగుల చవితి శుభాకాంక్షలు 🐍

నాగుల చవితి శుభాకాంక్షలు

🐍🌺🐍

నాగదేవతకు ప్రార్థనలు చేసే ఈ పవిత్ర దినాన మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ
సంతోషం, సమృద్ధి మరియు ఐశ్వర్యం కలగాలని కోరుకుంటున్నాము

May Lord Naga bless you with health, wealth, and prosperity
on this auspicious occasion of Nagula Chavithi

🙏✨🙏

Warm Wishes from
యానాంతక్షశిల (YANAMTAKSHASHILA)

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading