📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Yanam Updates 16-02-2026

ముగిసిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్

యానాంలోని మల్లాడి సత్యలింగ నాయ్కర్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన మల్లాడి ధర్మారావు మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. 28 జట్లు పోటీలో పాల్గొన్నాయి. డబుల్స్ విజేతలుగా మురళి, విజయ్ నిలిచారు. రన్నరప్‌గా పవన్, చిన బాబు నిలిచారు. ఉత్తమ క్రీడాకారుడిగా యువరాజ్ ఎంపికై నగదు బహుమతిని అందుకున్నారు. విజేతలకు ట్రోఫీలు మల్లాడి కృష్ణారావు అందజేశారు. మల్లాడి రాజు, తాతాజీ పోటీలను నిర్వహించగా బ్యాడ్మింటన్ కోచ్ రజాక్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

ప్లాస్టిక్ వ్యర్థాలతో చెరువులు కలుషితం

యానాం సరిహద్దు ద్రాక్షారామ రోడ్డుమార్గంలో ఉన్న 58 ఎకరాల రక్షిత మంచినీటి చెరువులు తగిన పర్యవేక్షణ లేక కలుషితమవుతున్నాయి. తాగునీటి కొరత అధికంగా ఉండే వేసవిలో నీటి సరఫరా కోసం 2005లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యానాంకు ఈ భూములను మంజూరు చేసింది. ధవళేశ్వరం నుంచి పైప్‌లైన్ ద్వారా చెరువులకు నీటి సరఫరా జరుగుతోంది. అయితే సరైన కాపలా లేకపోవడంతో సాయంత్రం వేళల్లో కొందరు చెరువు గట్లపై మద్యం సేవించి పేపర్ ప్లేట్లు, సీసాలు అక్కడే పారేస్తున్నారు. దీంతో అవి చెరువులో పడుతూ నీరు కలుషితం అవుతోంది. నిత్యం నడక, వ్యాయామానికి వచ్చే ప్రజలు ఈ పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపనులశాఖ కార్యనిర్వాహక ఇంజినీరు ఎక్కువ రోజులు సెలవులో ఉండటంతో సరైన పర్యవేక్షణ, జవాబుదారీతనం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading