📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

ఆనపకాయతో వంటలు

ఆనపకాయ హల్వా: ముందుగా ఆనపకాయ ని శుభ్రం గా కడిగి, చెక్కు తీసి, తురుముకుని నీరు అంతా పోయేలాగా పిండుకోవాలి. ఇప్పుడు ఈ తురుము ని, నెయ్యి వేసుకుని పచ్చి వాసన పోయేదాక వేయించుకోవాలి. తర్వాత, పాలు పోసుకుని ఉడికించుకోవాలి. ఉడికి కొంచెం దగ్గర పడ్డాక, పంచదార, యాలకుల పొడి వేసుకుని మరికాసేపు ఉడికించాలి. చివరగా, పచ్చి కోవా వేసి మరో రెండు నిమిషాలు ఉంచి, నేతి లో వేయించుకున్న జీడిపప్పు తో అలంకరిస్తే సరి! నోరూరించే హల్వా సిద్దమైనట్లే!

ఆనపకాయ పాయసం(ఖద్దు కా ఖీర్): ముందుగా, ఆనపకాయని చెక్కు తీసి, తురుముకుని, నేతి లో వేయించుకుని పక్కనుంచుకోవాలి. తర్వాత పాలని, చిక్కబడేంత వరకు సన్నని మంట పై మరగనివ్వాలి. ఇందులో, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, నానబెట్టి రుబ్బుకున్న జీడిపప్పు ముద్ద ని,వేడి పాలలో కరిగించి పెట్టుకున్న పచ్చి కోవా ని కలుపుకోవాలి. సగ్గుబియ్యం ఉడికాక, వేయించి పక్కన పెట్టుకున్న ఆనపకాయ తురుముని, పంచదార ని, యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. చివరగా, బాదం, పిస్తా పప్పుల తురుముని వేసుకోవాలి.

ఆనపకాయ కోఫ్తా కూర:ఆనపకాయ తురుము లో, నీరు పిండేసుకుని, కొద్దిగా శనగ పిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాల, కొత్తిమీర తరుగు వేసి కలుపుకుని, కోఫ్తాల్లా చేసుకుని, నూనె లో వేయించుకుని పక్కన బెట్టుకోవాలి. ఇంకో గిన్నె లో, ఉల్లిపాయ తరుగు, టమాట తరుగు వేసి కాసేపు వేయించుకుని, నానబెట్టిన జీడిపప్పు ని కలుపుకుని, రుబ్బుకోవాలి. బాణాలిలో నూనె పోసి వేడెక్కాక, జీల కర్ర, బిర్యానీ ఆకు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి వేసుకోవాలి. ఇప్పుడు, రుబ్బి పెట్టుకున్న టమాట, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకుని, నూనె పైకి తేలెంత వరకు ఉడికించుకోవాలి. చివరగా, కోఫ్తాలు, తరిగిన కొత్తిమీర వేసుకోవాలి.

ఆనపకాయ పరాటా: రెండు కప్పుల గోధుమ పిండి లో, ఒక కప్పు ఆనపకాయ తురుము, తరిగిన పచ్చి మిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసుకుని, చాలా కొద్దిగా నీళ్ళు పోసుకుని, చపాతీ పిండి లా కలుపుకోవాలి. ఒక ఇరవై నిమిషాలు పిండి ని పక్కన పెట్టుకుని, తర్వాత పిండి ముద్దని తీసుకుని, కొంచెం మందంగా పరాటాలు చేసుకొవాలి. వీటిని, పెనం మీద, రెండు వైపులా వెన్న వేసుకుంటూ కాల్చుకోవాలి.

ఆనపకాయ-టమాట పచ్చడి: ఆనప కాయ, టమాట, పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా నూనె వేసి ఉడికించి, కొంచెం చింతపండు, జీలకర్ర, రెండు వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు వేసుకోవాలి.చల్లారాక, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు, శనగ పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి మిగతా తాలింపు దినుసులు కూడా వేసుకుని పోపు పెట్టుకోవాలి.

ఆనపకాయ-నువ్వుల కూర: ఆనప కాయని శుభ్రంగా కడిగి, చెక్కు తీసి ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. బాణలి లో నూనె పోసి, వేడెక్కాక తాలింపు దినుసులు, తరిగిన ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఆనపకాయ ముక్కలు వేసి, కొద్దిగా నీరు పోసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చి మిర్చి ముద్ద, తగినంత ఉప్పు వేసి ఉడికాక, చివరగా నువ్వుల పొడి, కొత్తిమీర కలుపుకుని దించేసుకోవాలి. ఈ కూర చపాతీ లోకి, అన్నం లోకి కూడా బాగుంటుంది.

Leave a Reply

Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading